ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట!

  • లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ
  • రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల ఆధారంగా క్యాన్సర్ ముప్పు అంచనా
  • ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతుల కంటే కచ్చితమైన ఫలితాలు
  • ధూమపానం చేయని వారిలోనూ క్యాన్సర్ రిస్క్‌ను గుర్తించే సామర్థ్యం
  • క్యాన్సర్‌కు ముందు శరీరంలో జరిగే మార్పులను పసిగట్టడం దీని ప్రత్యేకత
వైద్య పరిశోధన రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్) బారిన పడే ప్రమాదాన్ని, వ్యాధి నిర్ధారణకు ఐదేళ్ల ముందుగానే గుర్తించగల ఒక అధునాతన రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల విశ్లేషణ ఆధారంగా పనిచేసే ఈ పరీక్ష, క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు చికిత్సలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'సెల్'లో ప్రచురితమయ్యాయి.

యూకే బయోబ్యాంక్‌కు చెందిన 48,000 కంటే ఎక్కువ రక్త నమూనాలను విశ్లేషించి ఈ ప్రొటీన్ల మార్కర్‌ను కనుగొన్నారు. వయసు, ధూమపానం అలవాటు, గతంలో సంభవించిన ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అంశాలతో ఈ ప్రొటీన్ల సమాచారాన్ని జోడించి చేసిన విశ్లేషణ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రిస్క్ మోడళ్ల కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా ధూమపానం అలవాటు లేని వారిలో సైతం క్యాన్సర్ ముప్పును ఇది కచ్చితంగా అంచనా వేసింది.

సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తించడం వల్ల చికిత్స కష్టతరంగా మారి, మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీటీ స్కాన్ వంటి పరీక్షలు ప్రధానంగా ధూమపానానికి అలవాటు పడిన వృద్ధుల్లో క్యాన్సర్ ను గుర్తించగలుగుతున్నాయి. అయితే, ఈ కొత్త పరీక్ష ద్వారా వాయు కాలుష్యం వంటి ఇతర కారణాలతో క్యాన్సర్ బారిన పడే వారిని సైతం ముందుస్తుగా గుర్తించే అవకాశం కలుగుతుంది.

ఈ పరిశోధనను ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందక ముందే ఊపిరితిత్తులలో చోటుచేసుకునే వాపు వంటి మార్పులను ఈ పరీక్ష గుర్తిస్తుందని, తద్వారా సకాలంలో నివారణా చర్యలు చేపట్టవచ్చని వారు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ పరీక్ష సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Lung cancer blood test
Early cancer detection
14 protein markers
Francis Crick Institute
University College London
Cancer risk prediction

More Telugu News